మంతెన సత్యనారాయణ రాజు ప్రకృతి వైద్యులు[1]. మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనే టెలివిజన్ కార్యక్రమం ద్వారా పరిచయమై గుర్తింపు పొందాడు. ఉప్పు రుచులకు రాజు - రోగాలకు రారాజు అని, ఉప్పు, నూనె వాడకం ఆరోగ్యానికి చేటు అని, ఆరోగ్యం గురించి రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల ప్రసంగాలు చేసిన ఘనత ఈయనదే.
మంతెన సత్యనారాయణ రాజు గుంటూరు జిల్లా,బాపట్ల తాలూకా, పిట్లవానిపాలెం మండలం, అలాకాపురం అనే గ్రామంలో రామరాజు, లక్ష్మమ్మ దంపతులకు 1967 ఏప్రిల్ 23న జన్మించాడు. అతను తల్లిదండ్రులు ప్రకృతి వైద్యులుగా ఉండేవారు.[2][3] ఇంటర్మీడియట్ వరకు విద్యాభ్యాసం అతని స్వగ్రామంలో జరిగింది.[4] ఇంటర్మీడియట్ పూర్తయ్యాక సెలవులలో రెండు నెలల పాటు అతను కాకినాడలో ఉన్న చోడే అప్పారావు ప్రకృతి ఆశ్రమంలో ఉండడం జరిగింది. అక్కడ అతనికి ఆహారానియమాలు పాటించడం, ఆసనాలు వేయడం, ఉప్పు-నూనె లేని ఆహారం తినడం బాగా అలవాటు అయ్యాయి. ఆ తరువాత బి.ఫార్మసీ చదవడానికి ఇతర రాష్ట్రాలకు వెళ్ళి అక్కడ వున్నప్పుడు కూడా ఉడకబెట్టిన కూరలు, ముడిబియ్యపు అన్నం వండుకు తినడం, ఆసనాలు వేయడం కొనసాగించడం జరిగింది. ఆరు నెలల పాటు ఇలా ఆచరించేసరికి ఆరోగ్యం అంటే ఎలా వుంటుంది అనేది పూర్తిగా అర్థమైంది. కఫం, రొంప, దగ్గు, జ్వరాలు ఇలాంటివి పూర్తిగా లేకుండా పోయి, రోగనిరోధక శక్తితో మంచి మార్పు రావడం జరిగింది. అప్పట్నుంచి అతనికి ఈ ప్రకృతి విధానం మీద ఆసక్తి బాగా పెరిగింది. దీని వల్ల అతనికి ప్రకృతి జీవన విధానం సంపూర్ణ ఆరోగ్యాన్ని తెచ్చిపెట్టగలదనే ప్రగాడ విశ్వాసం కలిగింది. అనారోగ్యం గా ఉన్నప్పుడు దీర్ఘ ఉపవాసాలు చేయడం వల్ల ఎటువంటి మందులు లేకుండా ఆరోగ్యం మెరుగుపడడం గమనించాడు.[5]
హైదరాబాదులో సిరీస్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ప్రకృతి విధానాన్ని ఆచరిస్తూ తోటి ఉద్యోగస్తులకు ఆసనాలు, ఆహార నియమాలు నేర్పుతూ ప్రకృతి విధానం పట్ల అవగాహన కలిగించేవాడు. ఒకరోజు అతనికి ప్రమాద వశాత్తు కాలువిరిగి విశ్రాంతి తీసుకుంటున్న సమయం అతని ఆశయం మారడానికి ఎంతో ఉపయోగ పడింది. పైచదువులకు విదేశాలకు వెళ్ళాలి అనే ఆలోచనకి స్వస్తి చెప్పి ప్రకృతి జీవన విధాన ప్రచారమే తన జీవిత లక్ష్యంగా మార్చుకుని అప్పటినుంచి ప్రజలకు సేవలందిస్తూ ఉన్నారు
అలా కొన్నాళ్లు రుచులు తింటూ, కొన్నాళ్లు ఈ ప్రకృతి విధానం ఆచరిస్తూ దేహంపైన పరిశోధనలాగా ప్రతిదానినీ గమనిస్తూ రకరకాల రుచులు తింటే రోగాలు ఎందుకు వస్తున్నాయని వారిపైన వారే పరిశోధనలు చేసుకుంటూ వుండేవాడు. చివరకు ఈ ప్రకృతి విధానం ఎంతో గొప్పదని ఆచరణ రూపంలో అర్థం చేసుకోగలిగాడు. యోగా, ప్రకృతి వైద్యం అధ్యయనంచేసి దానిపట్ల పూర్తి ఆసక్తి, అవగాహన పెంచుకోవడం జరిగింది.
1994 నుండీ ఊరూరూ తిరుగుతూ, ఆయన అనుభవాలను, ప్రకృతి విధానం వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలను సైంటిఫిక్ గా వివరిస్తూ ఆరోగ్య ప్రచారం అనే మహాయజ్ఞాన్ని ప్రారంభించారు. ఎన్నో జిల్లాలలో ఉచితంగా కార్యక్రమాలు నిర్వహించి ఎటువంటి ప్రతిఫలాన్నీ ఆశించకుండా సేవా దృక్పథం తో విశ్రాంతి రహితంగా ప్రచారం చేస్తూ వచ్చాడు.
అతని భార్య విశాల కూడా ప్రకృతి వైద్యురాలు.
2000-2008 మధ్య దూరదర్శన్ లోనూ, ఈటీవీ సుఖీభవలో అప్పుడప్పుడూ ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలు అందించేవాడు. ‘మాటీవీ’ లో “మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే” అనే శీర్షికన 800 ఎపిసోడ్స్ ప్రసారమయ్యాయి. అదే సమయంలో ఐ న్యూస్ ఛానెల్ కి 15 నిమిషాలు ఎపిసోడ్స్ 360 “జీవన రహస్యాలు” అందించాడు. 2009 లో లవణం గారితో అప్పగించబడిన “సంస్కార్ ప్రకృతి ఆశ్రమం” ను 25 పడకల నుంచి 100 పడకల ఆశ్రమంగా మార్చి నిర్వధికంగా ఆ ఆశ్రమ బాధ్యతను కొనసాగిస్తున్నాడు. 2010 నుంచి విజయవాడ ఆరోగ్యాలయ నిర్మాణంలో, నిర్వహణలో అలసట లేకుండా ఆశ్రమ అభివృద్ధికి కృషిచేస్తూ ఉన్నాడు. ఈ రెండు ఆశ్రమాల పర్యవేక్షణ, నిర్వహణ తో పాటూ ప్రస్తుతం మాగోల్డ్ ఛానల్ లో ఉదయం 6:00-6:30 వరకు “365 ఆరోగ్య రహస్యాలు” అనే కార్యక్రమం తో ప్రజలకు చేరువగా ఉంటూవచ్చాడు.